విమర్శలకి ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రి

Share this story






ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ చేజారడంతో టీమిండియాపై వస్తున్న విమర్శలకి జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిఘాటుగా బదులిచ్చాడు. ఇటీవల నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఒక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న విషయం తెలిసిందే. దీంతో.. టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆటతీరుపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ పెదవి విరిచారు. గంగూలీ అయితే.. ఒక అడుగు ముందుకేసి.. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ ఇలా వరుసగా విఫలమవుతుంటే..? హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించాడు. ఇలా విమర్శలు పెరగడంతో ఎట్టకేలకి రవిశాస్త్రి బుధవారం స్పందించాడు.

‘టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు శక్తివంచన లేకుండా పోరాడుతోంది. కానీ.. కొన్ని మ్యాచ్‌ల్లో ఇంగ్లాండ్‌‌ జట్టు పైచేయి సాధించింది. అయినప్పటికీ టీమిండియా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తూనే ఉంది. గత మూడేళ్లుగా భారత్ జట్టు ఓవర్‌సీస్‌లో తొమ్మిది టెస్టుల్లో గెలుపొందింది. అలానే విండీస్‌తో ఒకటి, శ్రీలంకపై రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ విజయం సాధించింది. గత 15-20ఏళ్ల కాలంలో దిగ్గజ క్రికెటర్లు జట్టులో ఉన్నప్పటికీ ఏ భారత్ జట్టు ఈ విజయాల్ని అందుకోలేకపోయింది. కాబట్టి.. ఆ జట్లతో పోలిస్తే ప్రస్తుత ఉన్న జట్టు మెరుగని నిరూపించాం’ అని రవిశాస్త్రి ఘాటుగా బదులిచ్చాడు.