2018 లో కూడా ఇండియన్ బాడ్మింటన్ గర్వించదగ్గ స్టార్స్ గా రాణించిన పీ.వీ సింధు, సైనా నెహ్వాల్

Share this story



ఈ సంవత్సరం లో, బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు టోర్నమెంట్ ల యొక్క ర్యాంకింగ్ విధి విధానాలను విధానాలను మార్చిన సంగతి మనకు తెలిసిందే. అందులో భాగంగా, క్రీడా కారులు గెలుచుకున్న ప్రైజ్ మనీ ఆధారంగా వారి యొక్క ర్యాంకింగ్ లేదా పతకాన్ని బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వారు నిర్ణయిస్తారన్నమాట. అయితే, ఈ కొత్త ఫార్మాట్ లో కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి బాడ్మింటన్ లో తనకు తిరుగు లేదని నిరూపిస్తూ పీ.వీ సింధు మరో సారి తన సత్తా చాటింది.అంతే కాక, మన దేశ గౌరవాన్ని ఒక అంతర్జాతీయ వేదిక పై రెట్టింపు చేసి, సింధు మరో మారు చరిత్ర సృష్టించింది. పీ.వీ సింధు, తను, ఈ సంవత్సరం ఆడిన ప్రతీ ఆటలో కనీసం ఒక వెండి పతాకాన్ని సాధించి, బాడ్మింటన్ లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. చివరగా, తను ఆడిన బాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్ లో ఏకంగా ఛాంపియన్ గా నిలిచి మన దేశ గౌరవాన్ని నలు దిక్కులా చాటింది.

2018 వ సంవత్సరం లో భారత బాడ్మింటన్ లో పీ.వీ సింధు, సైనా నెహ్వాల్ ఇంకా ఒకరిద్దరు క్రీడా కారులు తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ పేర్లు లేవనే చెప్పాలి. పుల్లెల గోపీచంద్ యొక్క ప్రియ శిష్యులైనటువంటి సింధు, సైనా ఇప్పటి వరకు జరిగిన అన్ని టోర్నమెంట్ లలో రాణిస్తూ, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి లో సత్తా చాటుతూ భారత దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.

అయితే, భారత బాడ్మింటన్ లో కొత్తగా ఏ ఒక్క యువ క్రీడా కారుడు లేదా క్రీడా కారిణి కూడా ఆటలో రాణించ లేకపోతున్నారు. ప్రపంచ వేదికలపై దేశం తరుపున ఆడి నిలవలేకపోతున్నారు. ముఖ్యం గా చెప్పాలంటే, ఈ సంవత్సరం లో సింధు, సైనా లని పక్కన పెడితే ఒక్క లక్ష్యా సేన్ మాత్రమే భారత బాడ్మింటన్ లో కొంచెం వెలుగు లోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆమె తన అద్భుతమైన ప్రదర్శన లతో, క్రీడా శైలి తో భారత బాడ్మింటన్ అభిమానుల్లో కొత్త ఆశల్ని చిగురింప చేస్తోంది.

పీ.వీ సింధు విషయానికి వస్తే, మొన్నటి వరకు విమర్శించిన నోళ్లే ఇప్పుడు తనని ఒక అద్భుత క్రీడా కారిణి అని మెచ్చుకుంటున్నాయి. వరుసగా ఐదు వెండి పతకాలు సాధించి, ద్వితీయ స్థానాలను సంపాదించుకున్న సింధు, తన గొప్ప ఆట తీరును చాటుతున్నా, కొంత మంది ఆమెను, కేవలం ద్వితీయ స్థానాలకే పరిమితం కావాల్సొస్తుందేమో అంటూ విమర్శన అస్త్రాలను సంధించారు.

ఇప్పుడు, సింధు, వాటికి సమాధానంగా ఏకంగా బాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ లోనే ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు, మన దేశం తరుపున ఆడి, బాడ్మింటన్ లో వరల్డ్ టూర్ ఛాంపియన్ గా నిలవ లేకపోయారు, ఒక్క సింధు తప్ప. అందుకే, పీ.వీ సింధు ని ఇప్పుడు మన జాతీయ మీడియా ఆకాశానికి ఎత్తేస్తోంది.

ఇక మరో భారతీయ బాడ్మింటన్ స్టార్ అయినటువంటి సైనా నెహ్వాల్ విషయానికి వస్తే, విధి వక్రీకరించినా కూడా సైనా తన యొక్క పట్టుదల, స్థైర్యం తో ఎంతో కృషి చేసి మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతోంది. ఈ మధ్య జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో సైనా కు లభించిన స్వర్ణ పతకమే దీనికి నిలువెత్తు నిదర్శనం. ఆసియన్ గేమ్స్ లో కూడా ఒక అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది సైనా నెహ్వాల్. అందులో, కాంస్య పతకాన్ని సాధించి స్టార్ గా నిలిచింది.