నాటింగ్‌హామ్: టెస్టు సిరీస్‌పై ఆశలు నిలిపిన మూడో టెస్టు విజయాన్ని ఎంతోసేపు నిలుపుకోలేకపోయింది టీమిండియా, నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కోహ్లీసేన సిరీస్‌కు కీలకమైన మ్యాచ్‌ను చేజార్చుకుని అభాసుపాలైంది. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జరగనున్న ఐదో టెస్టు అనంతరం.. టీమిండియా తిరుగుముఖం పట్టనుంది. టీ 20 సిరీస్ మినహాయించి వన్డే, టెస్టుల పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియా పేలవ ఆటతీరు కొనసాగిందిలా..
భారత్ జట్టు పేలవరీతిలో
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను భారత్ జట్టు పేలవరీతిలో చేజార్చుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో 245 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 184 పరుగులకే కుప్పకూలిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (58) 130 బంతుల్లో 4 ఫోర్లతో, వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51) 159 బంతుల్లో ఒక ఫోర్‌తో అసాధారణ పోరాటంతో గెలుపుపై ఆశలు రేపినా.. మిగతా బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు.
60 పరుగుల తేడాతో పరాజయం
దీంతో.. భారత్‌కి 60 పరుగుల తేడాతో పరాజయం తప్పలేదు. తాజా విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లాండ్ 3-1తో కైవసం చేసుకోగా.. సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ శుక్రవారం నుంచి జరగనుంది. లక్ష్యఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (0), శిఖర్ ధావన్ (17) మరోసారి వైఫల్యాల బాట కొనసాగించగా.. పుజారా (5) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో.. 22/3తో భారత్ ఒత్తిడిలో పడింది.
101 భాగస్వామ్యం:
క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లి – అజింక్య రహానె జోడి నాలుగో వికెట్‌కి అభేద్యంగా 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో గెలుపుపై భారత్ శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ.. జట్టు స్కోరు 123 వద్ద విరాట్ కోహ్లి ఔటవగా.. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్య (0), రిషబ్ పంత్ (18), ఇషాంత్ శర్మ (0), మహ్మద్ షమీ (8) క్రీజులో నిలవలేకపోయారు. రహానె కూడా జట్టు స్కోరు 153 వద్ద ఔటవడంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివర్లో అశ్విన్ (25) కాసేపు క్రీజులో నిలిచి ఓటమి అంతరాన్ని కొంచెం తగ్గించగలిగాడు.
గురువారం ఆరంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకి కుప్పకూలగా.. భారత్ జట్టు 273 పరుగులకి ఆలౌటైంది. దీంతో.. 27 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు 271 పరుగులకి ఆలౌటవడంతో భారత్ ముందు 245 పరుగుల టార్గెట్ నిలిచింది. కానీ.. లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన భారత్ 69.4 ఓవర్లలో 184కే కుప్పకూలిపోయింది.