షూటింగ్ లో అత్యుత్తమ పురస్కారమైన ‘బ్లూ క్రాస్’ ని అందుకుని చరిత్ర సృష్టించిన అభినవ్ బింద్రా

Share this story


అభినవ్ బింద్రా మరొకసారి తన సత్తా చాటి భారత దేశ గౌరవాన్ని నలు దిక్కులా వ్యాపింపచేసాడు. షూటింగ్ లో అత్యుత్తమ పురస్కారమైన ‘బ్లూ క్రాస్’ ని సొంతం చేసుకున్న మొట్ట మొదటి భారతీయుడిగా తను చరిత్రలో నిలిచాడు. 2008 లోనే అభినవ్ బింద్రా బీజింగ్ ఒలింపిక్స్ లో పాల్గొని మన దేశానికి షూటింగ్ లో ఒక స్వర్ణాన్ని తెచ్చి పెట్టాడు.

అభినవ్ బింద్రా ఇప్పటివరకు ఏడు కామన్వెల్త్ పతకాలను కైవసం చేసుకోగా అందులో నాలుగు స్వర్ణాలు ఉండటం గమనార్హం. అభినవ్ ఆసియన్ ఆటలలో మన దేశం తరుపున షూటింగ్ లో పాల్గొని మూడు పతకాలను పొందాడు. అన్నింటికన్నా గొప్ప విషయం ఏంటంటే అభినవ్ 2006 లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఏకంగా స్వర్ణాన్ని సాధించి ఆ రోజుల్లోనే చరిత్రకెక్కాడు.

భారత దేశ ప్రభుత్వం అభినవ్ బింద్రా యొక్క గొప్ప తనాన్ని ఆ రోజుల్లోనే గ్రహించి 2000వ సంవత్సరంలో తన సేవలకు గాను దేశ అత్యుత్తమ అవార్డు అయినటువంటి అర్జున అవార్డు ను బహుకరించింది. అభినవ్ 2001వ సంవత్సరం లో ప్రభుత్వం చే క్రీడలలో అతి గొప్పదైన రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు ను అందుకున్నాడు. 2009వ సంవత్సరంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని దేశ రాష్ట్రపతి చే అందుకున్నాడు.

భారత దేశం లో ఇప్పటివరకు ఒలింపిక్స్ లోని షూటింగ్ విభాగం లో స్వర్ణాన్ని సాధించిన ఏకైక వ్యక్తి అభినవ్ బింద్రా. అయితే ఇప్పుడు తను షూటింగ్ లో లోకం లోనే అతి గొప్పదైన, అత్యుత్తమమైన పురస్కారం అయిన “బ్లూ క్రాస్” ని సొంతం చేసుకుని మళ్లీ తన యొక్క సత్తా చాటాడు. ఈ పురస్కారాన్ని అభినవ్ బింద్రాకు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) శుక్ర వారం నాడు బహుకరించింది.

బ్లూ క్రాస్ అవార్డుని గెలుచుకున్న ఈ ముప్ఫై ఆరేళ్ళ యువ కెరటం తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. తన సొంత ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్నీ తెలియ చేసాడు. “మునిచ్ జనరల్ అసెంబ్లీ లో నేను ఈ అత్యుత్తమ బ్లూ క్రాస్ అవార్డు ని అందుకోవడం ఎంతో గౌరవంగా, ఆనందం గా ఉంది. క్రీడాకారుల కోసం మరియు ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ISSF) కోసం పనిచేయటం నా అదృష్టం,” అని తన సంతోషాన్ని ట్విట్టర్ లో అభినవ్ బింద్రా వ్యక్తం చేసాడు.

అభినవ్ బింద్రా 2016వ సంవత్సరం లో జరిగినటువంటి రియో డి జనేయరో ఒలింపిక్ పోటీలలో తన అదృష్టాన్ని పరీక్షించు కోగా స్వల్ప తేడాతో స్వర్ణ పతాకాన్ని చేజారాడు. తను చివరగా ఈ ఒలింపిక్స్ ఆటలలో పాల్గొనటం గమనార్హం ఎందుకంటే అభినవ్ తన క్రీడా జీవితానికి 2016 లో రిటైర్మెంట్ ద్వారా స్వస్తి పలికాడు.

అభినవ్ బింద్రాకు ప్రస్తుతం మొహాలీ మరియు న్యూ ఢిల్లీ నగరాలలో ‘అభినవ్ బింద్రా టార్గెటింగ్ పెర్ఫార్మన్స్ సెంటర్’ పేరుతో హై టెక్ రిహాబ్ సెంటర్లను ఏర్పాటు చేసాడు. ఈ సెంటర్ల ద్వారా అభినవ్ అన్ని రకాల క్రీడాకారులకు తమ క్రీడా ప్రదర్శన ను మెరుగు పరిచే వీలును కలిపిస్తున్నాడు.క్రీడాకారులు త్వరగా గాయాల నుండి కోలుకోవడానికి వీలుగా ఈ సెంటర్లలో ఎన్నో సేవలను అందిస్తారు. ఈ విధంగా అభినవ్ బింద్రా తన యొక్క క్రీడా స్ఫూర్తి ఇంకా దాతృత్వాన్ని చాటుతున్నాడు.

అభినవ్ బింద్రా 1982వ సంవత్సరం సెప్టెంబర్ 28వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రం లోని డెహ్రాడూన్ అనే పట్టణం లో జన్మించాడు. అభినవ్ బాచిలర్ అఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA) లో పట్టా పొందాడు.