WWE లేటెస్ట్ న్యూస్: రా (RAW) కి తగ్గిపోయిన ప్రేక్షకాదరణ, కనుమరుగైన జాన్ సీన

Share this storyరా (RAW) ని విపరీతంగా ప్రేమించే వేల మంది ప్రేక్షకులు, అసలు ఇప్పుడు ఈ ఆటను చూడటానికి ఇష్ట పడనట్టుగా అనిపిస్తోంది. మొన్న విడుదలైన ఛానల్ వ్యూయర్షిప్ రేటింగ్స్ చూస్తే, మనకు ఈ విషయం బోధ పడుతుంది. రా (RAW) ని చూసే ప్రేక్షకుల సంఖ్య గోరంగా పడిపోయినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఈ సోమవారం నాడు ప్రసారం అయిన RAW ప్రోగ్రామ్ ను కేవలం 2.194 మిలియన్ అంటే, ఇరవై ఒక్క లక్షల తొంబై నాలుగు వేల మంది మాత్రమే వీక్షించారట. అసలు విషయం ఏంటంటే, ఇంత తక్కువ వ్యూయర్ షిప్, రా (RAW) ప్రారంభం నాటి నుండి నేటి వరకు ఏనాడూ నమోదు కాలేదట. అందుకే, షో యొక్క నిర్వాహకులు నానా తంటాలు పడి ఎలాగైనా వ్యూయర్ షిప్ పెంచడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారట.

ప్రస్తుతం, ఈ ప్రోగ్రాం, USA నెట్వర్క్ అనే ఛానల్ లో ప్రతీ సోమవారం రాత్రి ఎనిమిది గంటల (8 p.m) నుండి పదకొండు గంటల (11 p.m) వరకు అమెరికా లో ప్రసారం చేయబడుతోంది. స్మాక్ డౌన్ మాత్రం ప్రతీ మంగళవారం నాడు రాత్రి ఎనిమిది నుంచి పది గంటల వరకు అదే ఛానల్ లో ప్రసారం అవుతుంది. అయితే, రా (RAW) మూడు గంటల పాటు సాగుతుంది గనుక, మొదటి గంట సేపు ప్రేక్షకులు టీవీ లకు అతుక్కుపోయి చూస్తారట.

కానీ తరువాతి రెండు, మూడు గంటలు కూడా చూసే ప్రేక్షకులు చాలా తక్కువ అని వివిధ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ వారం మరీ గోరంగా, ఇప్పటి వరకు ఏనాడూ నమోదు కానీ విధంగా, అతి తక్కువ మంది ఆ రెండు, మూడు గంటల నిడివిని టీవీల్లో చూశారట. అయితే, రాబోయే ఆదివారం నాడు ఒక టి.ఎల్.సి (TLC) మ్యాచ్ ఉండటం తో, usa నెట్వర్క్ ఛానల్ యాజమాన్యం ఆ మ్యాచ్ పై భారీ ఆశలు పెట్టుకుందని కొన్ని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఆ టి.ఎల్.సి (TLC) మ్యాచ్ కి ముందు జరిగిన ఈ రా (RAW) మ్యాచ్ ఈ వారంలోనే చివరిది కావడం మరో విశేషం. ఆదివారం నాడు జరిగే ఆ మ్యాచ్ ద్వారా ఛానల్ వాళ్లు పే పర్ వ్యూ అనే పద్ధతి ని ఉపయోగించి యాడ్స్ ప్రచురితం చేయనున్నట్లు గా తెలుస్తోంది. అంటే, ఎంత మంది ఎక్కువ ప్రేక్షకులు మ్యాచ్ ని వీక్షిస్తే అంత కంటే ఎక్కువ డబ్బులు యాజమాన్యం సంపాదిస్తుందన్నమాట. ఈ టి.ఎల్.సి (TLC) మ్యాచ్ కి ‘టేబుల్స్, లాడ్ర్స్, మరియు చైర్స్’ అని పేరు పెట్టారు. అయితే ఇది, సేథ్ రోలిన్స్ మరియు బారన్ కార్బిన్ నడుమ సాగే ఉత్కంఠ భరితమైన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ షిప్ కావడం గమనార్హం.
కనుమరుగైన జాన్ సీన:
ఇక, మన సూపర్ స్టార్ అయినటువంటి జాన్ సీన విషయానికి వస్తే, అతడు WWE పైన పెద్దగా దృష్టి పెట్టడానికి ఇష్ట పడట్లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ లో అక్టోబర్ లో జరిగిన సూపర్ షో డౌన్ లో మాత్రమే జాన్ సీన చివరి సారిగా ఒక మ్యాచ్ ని ఆడటం జరిగింది. రెసల్ మేనియా 34వ ఈవెంట్ తరువాత సీన కేవలం రెండు, మూడు సార్లు మాత్రమే చివరిసారిగా కనపడ్డాడు. ఈ.ఎస్.పి.యెన్ (ESPN) ఛానల్ వారు ఈ విషయమై జాన్ సీన ని అడిగినపుడు, సీన, తను ప్రస్తుతం సినిమాల మీద దృష్టి పెట్టినట్లు వెల్లడించాడు.