ఏ.ఫ్.సి ఆసియన్ కప్ 2019: థాయిలాండ్ పై గెలుపు తర్వాత ఆనందం వ్యక్తం చేసిన సునీల్ ఛెత్రి

Share this story



ఈ ఆదివారం నాడు అబూ దాబి లో రాత్రి ఏడు గంటలకు జరిగిన ఇండియా vs థాయిలాండ్ మ్యాచ్ లో తమ సత్తా చాటి ఒక అద్భుతమైన విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు మన సునీల్ ఛెత్రి నేతృత్వం లోని భారత్ ఫుట్బాల్ జట్టు. మ్యాచ్ లో విజయానంతరం సునీల్ ఛెత్రి తన ఫాన్స్ ని ఉర్రుతలూగించాడు. అభిమానులందరినీ ఒకేసారి చప్పట్లు కొట్టమని చెపుతూ మన భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు.పోయిన ఏడాది నుంచి తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెపుతున్న మన ఫుట్బాల్ జట్టు కి ఈ విధంగా మ్యాచ్ లు జరిగిన అనంతరం సంబరాలను జరుపుకోవడం అలవాటు గా మారిందనే చెప్పుకోవాలి. ముఖ్యం గా సునీల్ ఛెత్రి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, మన దేశం లోని ప్రతీ ఒక్క ఫుట్బాల్ అభిమానిని ఒకే తాటి పైకి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నాడనే సంగతి మనకు తెలిసిన విషయమే. మ్యాచ్ లను వీక్షిస్తున్న తమ జట్టు యొక్క అభిమానులను ఆకట్టుకోవడం, ఇంకా వాళ్లను మ్యాచ్ లో లీనం అయ్యేలా చెయ్యడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ విధానాన్నే అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది మన భారత ఫుట్బాల్ జట్టు.

ఇక నిన్న జరిగిన ఈ మ్యాచ్ విషయానికి గనుక వస్తే, మన భారత జట్టు కు ఇది ఒక అత్యుత్తమ విజయం గానే మనం భావించాలి. ఏ.ఫ్.సి ఆసియన్ కప్ లో భాగంగా ఆదివారం నాడు జరిగిన ఈ మ్యాచ్ భారత ఫుట్బాల్ జట్టు కు మొదటిది కావడం గమనార్హం. థాయిలాండ్ తో తలపడ్డ మన జట్టు చాలా గొప్ప ప్రదర్శనతో మ్యాచ్ ని మొత్తం తమ వైపు లాగేసుకుని ప్రత్యర్థి జట్టు ను చిత్తు చిత్తు గా ఓడించింది. భారత దేశ కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటల (7 pm) ప్రాంతాన ప్రారంభం అయిన ఈ మ్యాచ్ లో, భారత జట్టు థాయిలాండ్ ఆటగాళ్లను ముప్పు తిప్పలు పెట్టి నాలుగు – ఒకటి (4-1) తేడా తో వారిని గోర పరాజయానికి గురి చేసి, తమ ఖాతా లో మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇంకొక అద్భుతమైన విశేషం ఏంటంటే, పంతొమ్మిది వందల అరవై నాలుగవ (1964 వ) సంవత్సరం నాటి నుంచి 2015 వ సంవత్సరం లో జరిగినటువంటి పదహారవ ఎడిషన్ ఏ.ఫ్.సి ఆసియన్ కప్ వరకు కూడా ఏనాడూ మొదటి మ్యాచ్ లో విజయం సాధించని మన భారత ఫుట్బాల్ జట్టు ఈ ఏడాదిలో జరిగిన మొదటి మ్యాచ్ లో విజయం సాధించడం ఒక అద్భుతం. అయితే, సునీల్ ఛెత్రి యొక్క అద్భుతమైన కెప్టెన్సీ నే ఇందుకు కారణం అని ప్రతీ ఒక్కరు పేర్కొనడం మరొక విశేషం.

ఈ మ్యాచ్ లో, సునీల్ ఛెత్రి యొక్క ఆట పరిణతి, వేగం ఒక ఎత్తయితే, అనిరుధ్ థాపా చేసిన గోల్ మరో ఎత్తు. వీరిద్దరికీ తోడుగా నిలిచి ఎంతో గొప్పగా ఆడి తన సత్తా ఏంటో చాటిన మరో అద్భుతమైన ఆటగాడు జేజే లాల్ పేక్ లువ. అతను చివరి నిమిషం లో చేసిన గోల్ భారత్ యొక్క విజయానికి మంచి ఫినిషింగ్ టచ్ గా నిలిచింది అని విశ్లేషకులు చెప్తున్నారు.

మొదటి ఆట లో మంచి విజయాన్ని అందుకున్న భారత్, జనవరి 10 వ తేదీన జరిగే మ్యాచ్ లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.